తెలంగాణ ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ నిరంకుశత్వంతో రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోతున్నారని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏమీ నెరవేరలేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు. ప్రజల గొంతుకగా.. ప్రజా సమస్యలను అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
అసలు రాష్ట్ర మిగులు బడ్జెట్, తొమ్మిదిన్నరేళ్ల రాబడి ఎటుబోయిందో కూడా తెలియటం లేదని భట్టి విక్రమార్క అన్నారు. దళిత బంధు.. బీసీ బంధు.. అంటూ కళ్లబొళ్లి మాటలు చెబుతున్న కేసీఆర్ పాలనలో.. ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదని తెలిపారు. శానసభసభా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతుందని భట్టి తెలిపారు. ప్రభుత్వం.. ముందు చూపు లేని కారణంగానే ఇవాళ వరదలతో జనజీవనం అతలాకుతలమైందని ఆరోపించారు. వరద ముంపులో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన చేస్తున్నారని భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు.