పవన్ కళ్యాణ్ సభలకు జగదాంబ, కొత్తూరు జంక్షన్లు బద్దలు అయిందని…నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సెటైర్లు పేల్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు మా పార్టీ నేతల వద్ద సమాధానం లేదని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. మద్యం అమ్మకాలలో ప్రభుత్వ పెద్దలు 30 వేల కోట్ల రూపాయలు అక్రమంగా అర్జిస్తున్నారన్న పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలకు, లేదు లేదు… మేము 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే తింటున్నామంటారా?, లేకపోతే మేము ఒక్క రూపాయి కూడా అక్రమంగా తినడం లేదంటారా?? అని ఆయన ప్రశ్నించారు.
ఒక్క రూపాయి కూడా తినడం లేదంటే, నగదులోనే మధ్యాన్ని ఎందుకు అమ్ముతున్నావు చిట్టి అంటూ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, మార్కెట్లో లభించే బ్రాండ్లు మన ఊరిలో ఎందుకు దొరకడం లేదు పొట్టి అని నిలదీస్తారని, ఇలా చిట్టి, పొట్టి అనే మాటలతో ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు తమ పార్టీ, ప్రభుత్వ పెద్దల వద్ద సమాధానం లేదని, అందుకే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అంటూ రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారి సభలకు ఏ రేంజ్ లో ప్రజాదరణ ఉన్నదో ఆయనకు సోషల్ మీడియా వేదికగా లభించిన వ్యూవర్ షిప్ ని పరిశీలిస్తే స్పష్టమవుతుందని, జనసేన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని 42,000 మంది తిలకించగా, ఇతర చిన్న చిన్న చానల్స్ ద్వారా ఏడు, ఎనిమిది వేల మంది వీక్షించారని అన్నారు. నీలి చానల్స్ సహకరించకపోయినా, ఆయనకున్న ప్రజాధరణ ను సోషల్ మీడియా మాధ్యమం తేట తెల్లం చేసిందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారని పవన్ కళ్యాణ్ గారు విమర్శించారని, రాష్ట్రంలో సారా వ్యాపారం ద్వారా 30 వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారని అన్నారు.