తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరారు. ఆ బిల్లుతో పాటు ఇతర బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపారు. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్ అడిగారు. తన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? నిర్ధారించాలన్నారు. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించే సమయంలో గవర్నర్ పది సిఫార్సులు చేశారు. అవేంటంటే..
- ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా టీఎస్ఆర్టీసీకి చెందిన భూములు, ఆస్తుల యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలి. దాని అవసరాలకే వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైనమాట(అండర్‌టేకింగ్) ఇవ్వాలి.
- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి తగ్గట్లుగా ఆస్తుల విభజన పూర్తి చేయాలి.
- ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత తీసుకోవాలి.
- విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లానే పేస్కేల్స్, సర్వీస్ నిబంధనలు ఉండాలి. వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పీఎఫ్, గ్రాట్యుటీ.. ఇలా అన్ని సదుపాయాలు కల్పించాలి.
- తీవ్రమైన ఒత్తిడి, శారీరక సమస్యలు, ఆరోగ్యపరమైన కారణాలను చూపుతూ కార్మికులు విజ్ఞప్తి చేసుకొంటే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు అవకాశం ఉండాలి.
- ఆర్టీసీలో క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లాగానే మానవీయంగా ఉండాలి.
- ప్రభుత్వంలో విలీనం చేసుకొన్న ఉద్యోగులను వేరే శాఖలకు డిప్యూటేషన్ మీద పంపితే వారి స్థాయి, జీతం, పదోన్నతులకు రక్షణ ఉండాలి. పదోన్నతుల్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.
- ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు, ప్రయోజనాలు కల్పించాలి. వారి సర్వీసుకు పరిరక్షణ, పీఎఫ్‌తో పాటు అన్ని సదుపాయాలు కల్పించాలి.
- రెగ్యులర్, ఒప్పంద ఉద్యోగులకు సర్వీసులో ఉన్నంతకాలం ఆర్టీసీ ఆసుపత్రుల్లో సేవలు, ప్రభుత్వ ప్రాయోజిత చికిత్సలు, బీమా ప్రయోజనాలను నిర్దిష్ట స్థాయి వరకు ఉమ్మడిగా కల్పించాలి. రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలనూ ప్రభుత్వ ఆరోగ్య పథకంలో చేర్చాలి.
- ఓ స్వతంత్ర సంస్థకు అప్పగించడం లేదా మరేదైనా పద్ధతిలో బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలి. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారాన్ని భరించాలి.