రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పలు భవనాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సబితక్క.. మనసు నిండా ఇంద్రన్న రక్తం ఉందని.. తెలంగాణ కోసం ఎంతో సాయం చేసిన సబితక్క అంటే తనకెంతో గౌరవం అని మంత్రి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 30 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
‘యెన్కట మేం తెలంగాణ కోసం కొట్లాడుదుం. సబితక్క హోం మినిస్టర్. లోపల్నేమో మీరు గట్టిగా కొట్లాడుర్రి అంటుండే. అక్క మనసు నిండా మనసు నిండా తెలంగాణ వాదం. అట్ల తెలంగాణ కోసం ఎంతో ప్రేమతో పని చేశారు. హోం మినిస్టర్ ఉన్నా.. జర అట్ల పట్కపోదురు.. ఇట్ల ఇడ్సిపెడుదురు. మళ్లా ఫోన్ చేస్తనే ఉండే యెన్కకెళ్లి. అట్ల మేం టీఆర్ఎస్‌లో ఉన్నా.. వారు కాంగ్రెస్‌లో ఉన్నా.. మా పోరాటం మాత్రం తెలంగాణ కోసం. అప్పుడు మేం బాగా కొట్లాడుదుం. పైనకు చేయలేకపోవు కానీ.. ఆమె ఛాంబర్ వద్దకు వెళ్లినప్పుడు.. గన్‌మెన్‌ను బయటకు పంపి.. మాతో ముచ్చట పెట్టేవారు. అన్ని కుల్లకుల్ల మాట్లాడు. మంచిగ చేస్తుర్రు హరీశ్.. ఇంకా కొంచెం గట్టిగా చేయండని అంటుండే. అట్ల తెలంగాణ కోసం ఎంతో సాయం చేసిన మా సబితక్క అంటే నాకు చాలా గౌరవం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.