విజయవాడ నగరంలో ఇటీవల వైసీపీ పెద్దలు వరుసగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. టిడిపికి కంచుకోటగా ఉన్న నగరంపై స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెరెడ్డి నగరంలో పలు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేశారు. విజయవాడ వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ లో మల్లాది విష్ణు, ఈస్ట్ లో దేవినేని అవినాష్ పోటీ చేస్తారని ప్రకటించారు.
ఇక అభ్యధుల ప్రకటించిన తర్వాత జగన్ పర్యటించారు. గుణదలలో నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ జగన్ ప్రారంభించారు. గుణదల..విజయవాడ ఈస్ట్ పరిధిలో ఉంటుంది. అలాగే అవినాష్ ఇల్లు కూడా గుణదలలోనే ఉంది. దీంతో జగన్..అవినాష్ ఇంటికి వెళ్లారు. అవినాష్ తన కుటుంబ సభ్యులని జగన్‌కు పరిచయం చేశారు. ఓ అరగంట సేపు జగన్, అవినాష్ మాట్లాడుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఇలా అవినాష్ ఇంటికి జగన్ వెళ్ళడంతో రాజకీయంగా చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈస్ట్ లో వైసీపీ జెండా ఎగరాలని జగన్ చూస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు అక్కడ వైసీపీ గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గద్దె రామ్మోహన్ గెలిచారు. సౌమ్యుడుగా ముద్రవేసుకున్న గద్దె..నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటారు. సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటారు.
అయితే గద్దెని ఓడించడం అంత ఈజీ కాదు. కానీ ఆయన్ని ఢీకొట్టే విధంగా అవినాష్ రెడీ అయ్యారు. వైసీపీలోకి వచ్చిన దగ్గర నుంచి దూకుడుగా పనిచేస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతున్నారు. దీంతో ఈస్ట్ లో అవినాష్ బలం పెరిగింది. గద్దెపై పై చేయి సాధించే దిశగా వెళుతున్నారు. కాకపోతే ఈస్ట్ లో జనసేనకు కాస్త ఓటింగ్ ఉంది. టిడిపితో పొత్తు ఉంటే ఆ ఓటింగ్ కలిసొస్తే..అవినాష్‌కు రిస్క్. చూడాలి మరి ఈ సారి ఈస్ట్ లో అవినాష్ సత్తా చాటుతారో లేదో.