చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఉపాధ్యాయుడిపై ఇటీవల ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడమీ వేటు వేసిన విషయం తెలిసిందే. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదంటూ ఆయన్ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తాజాగా ఈ వ్యవహారంపై శివసేన నేత ప్రియాంకా చతుర్వేది తీవ్రంగా ఫైర్ అయ్యారు.
విద్యావంతుడైన రాజకీయ నాయకుడికి ఓటు వేయమనడం పక్షపాతంతో కూడిన అభిప్రాయం ఎలా అవుతుంది..? అని ప్రియాంకా ప్రశ్నించారు. అది యువతపై సానుకూల ప్రభావం చూపదా..? అని అడిగారు. కేవలం ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం వల్లే ఉద్యోగం తీసేస్తే.. అది సిగ్గుచేటు చర్య అని అన్నారు. ఆయన అభిప్రాయాన్ని ఎందుకు తప్పుగా భావిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
అన్‌అకాడమీ తొలగించిన ఆ ఉద్యోగి పేరు కరణ్ సంగ్వాన్. సంస్థ నిర్ణయం తర్వాత ఆయన ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. దాంట్లో ఈ వివాదం గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.