సచిన్ టెండూల్కర్ కి క్రికెట్ లో ఎంతటి ప్రత్యేక గుర్తింపు చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా సచిన్ కి కీలక బాధ్యతలను అప్పగించారు. భారత ఎన్నికల సంఘం సచిన్ ని నేషనల్ ఐకాన్ గా నియమించింది. సచిన్ కి ఉన్నటువంటి క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు సిద్ధం అయింది ఎన్నికల సంఘం. సుమారు మూడేళ్ల పాటు ఈ కీలక పదవీలో కొనసాగనున్నారు సచిన్.
ఈ క్రమంలో ఓటింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ.. దేశవ్యాప్తంగా ఓటర్లలో అవగాహన కల్పించే పలు కార్యక్రమాల్లో భాగం కానున్నారు సచిన్. అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు చేసిన టెండూల్కర్ కి కోట్లాది మంది అభిమానులున్నారు. యువతలోనూ సచిన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ గాడ్ క్రేజ్ ను ఉపయోగించి ఓటర్లను మరింత చైతన్యవంతం చేసేందుకు సిద్ధమైంది ఈసీ. గతంలో బాలీవుడ్ నటులు పంకజ్ త్రిపాఠి, అమిర్ ఖాన్ వ్యవహరించారు. క్రీడా విభాగంలో ఎం.ఎస్. ధోనీ, బాక్సర్ మేరీ కోమ్ నేషనల్ ఐకాన్ లుగా సేవలందించారు.