తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నామా నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయినట్టు తెలుస్తోంది. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. హైదరాబాద్ లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు భేటీ అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగించినట్టుగా సమాచారం.
తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినట్టు ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు తుమ్మలతో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేటేడ్ పదవులను కట్టబెట్టేందుకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ప్రచారం కొనసాగుతుంది. ఈ విషయంపై తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకున్నారు. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం టికెట్ కేటాయించింది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.