తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు రక్షా బంధన్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్’కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు.. మహాశక్తి కవచాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఈ పండగ అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అప్యాయతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అనేకమంది మహిళలను రాజకీయ అవకాశాలు దక్కాయని చంద్రబాబు అన్నారు. ఇక ఎన్ఠీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళా సంక్షేమం మొదలయ్యిందని అన్నారు. 1986లోనే ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తూ చట్టం చేశారన్నారు. ఆర్టిసిలో మహిళలకు కండక్టర్లుగా అవకాశం ఇచ్చింది తానేనని చంద్రబాబు అన్నారు. రిజర్వేషన్లు వున్నప్పటికీ రాజకీయాల్లో మహిళలకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదని… చట్టసభల్లోకి వారు మరింతమంది రావాలన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకూ టీడీపీ కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు. మహిళ మగవారితో సమానంగా పోటీ పడే పరిస్థితి రావాలన్నారు.