విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చీకటి దందాను వెలికి తీస్తామని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం నాడు సూర్యాపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్‌రెడ్డి చీకటి దందాను అడ్డుకున్నందుకే సూర్యాపేటలో బీసీ నేత వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. వట్టే జానయ్య యాదవ్‌కు మంత్రి జగదీశ్ రెడ్డితో ప్రాణహనీ ఉందన్నారు.
ఇంటెలిజెన్స్ అధికారులు కేసీఆర్ ఇంటికి మాత్రమే ఇంటెలిజెన్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లు ప్రభుత్వం ట్యాప్ చేస్తుందన్న ఆయన.. ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లు ట్యాప్ చేసినందుకే పోలీసు అధికారి దుగ్యాల ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఇచ్చారని అన్నారు. తక్షణమే దుగ్యాల ప్రణీత్ రావు ప్రమోషన్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్రమంగా కట్టబెడుతున్నారని అన్నారు. బీఅర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలపై ప్రభుత్వం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.