పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉండి నియోజకవర్గంలో ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా బాగున్నాయి కదా… సూపర్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. “మీరు కూడా భలే వాళ్లండీ! గతంలో నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను జిల్లాకు వస్తే, ఎక్కడో ఒక గ్రామంలో పది గుంతలు ఉంటే అందరూ వచ్చి నా మీద యుద్ధం చేశారు. అలాంటిది ఈ రోజు గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందా అని వెతుక్కునే పరిస్థితి వస్తే… ఇక్కడెవరూ మాట్లాడడంలేదు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం ట్రాన్సఫార్మర్ల రేట్లు విపరీతంగా పెంచేసింది.జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ధరలు విపరీతంగా పెంచి రైతులను దోచుకుంటున్నారు. ఖాళీ చెరువులకి కూడా వేలల్లో బిల్లులు వస్తున్నాయి.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీడ్ , ఫీడ్, మందులు, మినరల్స్, విద్యుత్, ఏరియేటర్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ ఆక్వా లాబ్స్ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. పెట్టుబడి పెరిగింది కానీ రొయ్య రేటు పెరగడం లేదు. స్థానిక అమ్మకాలు పెంచితే కానీ రైతుకి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదు.చేపల చెరువు తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.విదేశీ మారకద్రవ్యం తీసుకొచ్చే ఆక్వారంగాన్ని జగన్ నిర్లక్ష్యం చేశారు’’ అని రైతులు లోకేష్‌కు సమస్యలను విన్నవించారు.