తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఏకధాటి వర్షంతో నగరంలోని రహదారులు చెరువుల్లా మారిపోయాయి. నాలాలు ఉంపొగి ప్రవహిస్తూ వరదంతా రోడ్లపైకి చేరుతోంది. పనులపై బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళ ఆఫీసులకు వెళ్లే వాహనదారులంతా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ఐటీ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. సాధ్యమైనంత వరకూ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవల ఉద్యోగులు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురవని సమయంలో.. రద్దీ తక్కువగా ఉండే సమయంలో ఆఫీసుల నుంచి బయల్దేరాలని చెప్పారు.
నగరంలో పలు చోట్ల భారీగా వరద చేరి కాలనీలు మునిగిపోయాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది వరద నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు.