బరువెక్కిన హృదయంతో రాస్తున్నానంటూ లోకేశ్ బహిరంగ లేఖ

-

‘నా తండ్రి ఎన్నడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌ చేయడం చూసి నా కోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరుగుతోంది’ అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన శక్తిని ధారపోయడం చూస్తూ పెరిగా. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనకు విశ్రాంతి రోజంటూ తెలియదు. ఆయన రాజకీయాలు ఎప్పుడూ హుందాతనంగా, నిజాయతీగా ఉంటాయి. సేవలను పొందినవారి ప్రేమ, కృతజ్ఞతల నుంచి ఆయన ఆస్వాదించిన లోతైన ప్రేరణను చూశా. వాళ్ల హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపాయి. అవి పిల్లల ఆనందానికి సమానమైనవి. నేనూ ఆయన నుంచి ప్రేరణ పొంది అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌కు తిరిగొచ్చా. ఇది కఠినమైన నిర్ణయమైనా.. నాకు మన దేశం, వ్యవస్థలు, అన్నింటికిమించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కక్షసాధింపు చర్యలు, విధ్వంసక రాజకీయాలకు చంద్రబాబు ఎప్పుడూ పాల్పడలేదని లోకేశ్ అన్నారు. దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన వ్యక్తి.. ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని ప్రశ్నించారు. మన ప్రజల అభివృద్ధి, సంక్షేమం, అవకాశాలను ఆయన ఇతరులకంటే ముందుగా ఊహించినందుకేనా? అని ప్రశ్నించారు. బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిసిన కళ్లతో ఈ రోజు ఇది రాస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news