ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇదే క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన మంత్రి.. వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పవన్ అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి జోగి రమేష్.. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ను విమర్శించే స్థాయి, విశ్వసనీయత పవన్ కు లేదంటూ పవన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది ప్రజల మద్దతు, అభిమానాన్ని చూరగొన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అనీ, ఒంటరిగా పార్టీని స్థాపించి నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే వరకు ఆయన ప్రయాణం సాగిందని జోగి రమేష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని నియంత్రించుకోవాలనీ, అలా చేయకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని జోగి రమేష్ హెచ్చరించారు. జనసేన, టీడీపీల మధ్య ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉందనీ, వారి బంధం చాలా కాలంగా ఉందని మంత్రి జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు చర్యలకు తగిన శిక్ష పడిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలను వైసీపీ ఓడించడం ఖాయమని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.