విజృంభిస్తోన్న నిఫా.. అప్రమత్తమైన కేరళ సర్కార్

-

కేరళలో నిఫా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 2018లో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వైరస్ అప్పుడు 17 మందిని బలితీసుకుంది. ఈసారి మరింత ప్రమాదకరంగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని బలి తీసుకుంది. నిఫా వైరస్‌ సోకినవారు మరణించే ప్రమాదం ఎక్కువని భారత వైద్య పరిశోధనా మండలి హెచ్చరించటంతో కేరళ సర్కార్ అప్రమత్తమైంది. కట్టడి చర్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలకు కేరళ ప్రభుత్వం వైద్య బృందాలను పంపించింది. నిఫా బాధితులను కలిసిన వారి సంఖ్య పెరిగే ప్రమాదముందని కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు. రానున్న రెండు వారాలు తమ రాష్ట్రానికి చాలా కీలకమని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు కేరళలో భవిష్యత్‌లోనూ నిఫా కేసులు బయటపడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఎంత త్వరగా కేసులను గుర్తించగలిగితే ప్రాణనష్టం తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. కేరళలో నిఫా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news