తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ స్కీమ్ లపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఫన్నీగా ఉన్నాయన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ గురించి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏమీ మాట్లాడలేదని.. 9 మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపితే వారిద్దరు ప్రశ్నించలేదని మండిపడ్డారు.
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్లే దశాబ్దాల పాటు అనేకమంది యువత ప్రాణాలు కోల్పోయారన్నారు. 2004లోనే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి.. పదేళ్లు కాలయాపన చేశారని, ఫలితంగా ఎంతో మంది ఉద్యమకారులు అమరులయ్యారని అన్నారు. అలాంటివారు రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసన్న కవిత.. ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందో తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆలస్యం చేసినట్లుగానే వారు ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి రాగానే చేస్తారనే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు.