ఇరాన్ పార్లమెంటు తాజాగా ఓ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఆ దేశంలో మహిళలు హిజాబ్ ధరించకపోతే పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. మరోవైపు వారి వస్త్రధారణ సరిగ్గా లేకపోయినా కఠిన శిక్షలు విధించనున్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంటు బిల్లును ఆమోదించింది.
ఈ బిల్లు ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. హిజాబ్ ధరించని మహిళలకు సేవలందించే వ్యాపారులకు సైతం ఈ చట్టం వర్తిస్తుంది. గతేడాది హిజాబ్ వివాదం కారణంగా పోలీస్ కస్టడీలో మృతిచెందిన మహసా అమిని (22) ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇరాన్ ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం.
ఈ బిల్లు రాజ్యాంగ పరిరక్షకులుగా పనిచేసే మతాధికార సంస్థ గార్డియన్ కౌన్సిల్ అంగీకారం పొందాల్సి ఉంది. ఈ అంగీకారం కూడా పొందాక ప్రాథమికంగా మూడేళ్లపాటు బిల్లు అమలులోకి వస్తుంది. మరోవైపు ఈ బిల్లుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.