తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, సూర్యపేట, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రేపు ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంది. అటు అర్ధరాత్రి హైదరాబాదులో భారీవర్షం కురిసింది. కాగా, గురువారం ఉదయం నుంచి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏకధాటి వాన పడింది. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టి మండలంలో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లా కౌటాలలో 10.1, చింతలమానేపల్లి 6.5, బెజ్జూరు 5.6, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ 5.2, కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ 4.2, ములుగు జిల్లా మంగపేట 4, వరంగల్ జిల్లా పర్వతగిరి 3.9, ములుగు జిల్లా వాజేడులో 3.6 సెం.మీ. వాన పడింది.