వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ నియంతృత్వ ధోరణిలో సాగుతోందని ఆరోపించారు. మంత్రి అంబటి రాంబాబు తనవైపు వేలు చూపించి మీసం మెలేశారని.. తొడగొట్టి తనను రెచ్చగొట్టారని.. వెళ్లి సినిమాలు చేసుకోవయ్యా అంటూ పరుషంగా మాట్లాడారని బాలయ్య అన్నారు. తన వృత్తి అయిన నటనను అవమానించారని.. అందుకే తాను ప్రతిస్పందించానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడనని.. ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని తేల్చి చెప్పారు.
చంద్రబాబు, నారా లోకేశ్‌లకు ప్రజల్లో వస్తున్న మద్దతును సీఎం జగన్ ఓర్చుకోలేకపోతున్నారని బాలయ్య అన్నారు. నయాపైసా అవినీతి జరగని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో బాబును జైలుకు పంపారని.. ఇందులో బినామీలు లేరు, షెల్ కంపెనీలూ లేవని స్పష్టం చేశారు. ఇవన్నీ జగన్ మైండ్ గేమ్స్ అని.. వీటిని టీడీపీ ఎప్పుడో చూసేసిందని బాలకృష్ణ చెప్పారు.
విశాఖపట్నంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమిట్ కూడా జూనియర్ ఆర్టిస్టులతో నిర్వహించిందేనా అని బాలయ్య నిలదీశారు. అసలక్కడ జరిగిన ఒప్పందాలేంటి? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? వీటిలో దేనికీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని చెప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.