పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వర్గీయ హరీశ్వర్ రెడ్డి గారి స్వగృహంలో వారి పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి గారి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు మంత్రులు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అదేవిధంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అని సీఎం కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హరీశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.