ఐసీసీ వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్ లో కాలుమోపింది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్ బృందం కొద్దిసేపటి కిందట హైదరాబాద్ చేరుకుంది. ఈ మధ్యాహ్నం పాక్ జట్టు లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ మీదుగా భారత్ పయనమైంది. పాక్ జట్టు రాక నేపథ్యంలో హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పాక్ ఆటగాళ్లను ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వారికి కేటాయించిన హోటల్ కు తరలించారు. ఈ నెల 29న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు కివీస్ తో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ జట్టు ఉప్పల్ వేదికగా.. ఈనెల 29న న్యూజిలాండ్‌తో, అక్టోబరు 3న ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం అక్టోబరు 6న నెదర్లాండ్స్‌తో; అక్టోబర్ 10న శ్రీలంకతో ప్రధాన మ్యాచ్‌ల్లో తలపడనునుంది. ఈ విధంగా పాక్.. ఉప్పల్ గడ్డపై 4 మ్యాచ్‌లు ఆడనుంది. తెలుగు గడ్డపై ఇండియా మ్యాచ్‌లు లేకపోవటం నిరాశపరిచేదే అయినా.. పాక్ మ్యాచ్‌లు ఉండటం కాస్తైనా ఆనందపరిచేదే. ఈ మ్యాచ్‌కు ముందురోజు నగరంలో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుస రోజుల్లో అంటే తగినంత భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేయడంతో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులను అనుమతించడం లేదు. పాక్ క్రికెట్ జట్టు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో బసచేయనుంది.