తిరుమలలో వన్యప్రాణుల సంచారం భక్తులను హడలెత్తి్స్తున్నాయి. భక్తుల భద్రత దృష్యా టీటీడీ ఏర్పాటు చేసినా.. ఒక్కింత భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. అయితే.. తిరుమల అలిపిరి కాలిబాటలో ఇక చిరుతలు సంచారం లేదు.. భక్తులు ఎలాంటి భయాందోళన లేకుండా నడక మార్గంలో వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇది టీటీడీ అధికారులు చేసిన ప్రకటన. అయితే ఇది ఎన్నో రోజులు నిలవలేదు. తిరుమల కొండపై ఏకంగా ఈవో ఇంటి ముందే చిరుత సంచరించినట్లు భక్తులు, టీటీడీ సిబ్బంది గుర్తించారు. దీంతో భక్తులు, టీటీడీ సిబ్బందిలో విపరీతమైన భయాందోళన నెలకొంది.అయితే తిరుమలలో ఇప్పటికే ఆరు చిరుతలు బోనుకు చిక్కాయి.
ఓ బాలుడు, చిన్నారి లక్షితపై దాడి తర్వాత అప్రమత్తమైన టీటీడీ.. ఫారెస్ట్ అధికారులతో కలిసి ‘ఆపరేషన్ చిరుత’చేపట్టారు. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని గుర్తించి బోన్‌లు ఏర్పాటు చేయడంతో ఇప్పటికే ఆరు చిరుతలను బంధించారు. ఇక దాదాపు వారం రోజుల పాటు ట్రాప్ కెమెరాలకు చిరుతల సంచారం చిక్కకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నడకదారిలో భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. చిరుతలు ఇక లేవు అనే నిర్ణయానికి కూడా వచ్చారు టీటీడీ అధికారులు.. కానీ, మళ్లీ ట్రాప్ కెమెరాకు చిరుత సంచారం చిక్కడంతో ఆందోళన మొదలైంది. టీటీడీ ఈవో ఇంటి సమీపంలో రాత్రి సమయంలో చిరుత సంచారాన్ని ట్రాప్ కెమరాలు ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇక, ఆ చిరుతను కూడా బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.