కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కర్ణాటక ప్రజల తరపున హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు తెలిపారు. కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో నిరసనకారులు హీరో సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంపై శివ రాజ్ కుమార్ స్పందిస్తూ.. ‘మనం ఎప్పుడూ ఇతరుల మనోభావాలను గాయపరచకూడదు. కన్నడ చిత్ర పరిశ్రమ తరపున సిద్దార్ధ్ క్షమించండి. మీ కార్యక్రమంలో ఇబ్బంది పెట్టినవారు ఎవరో నాకు తెలియదు. మాకు ఈ ఘటన చాలా బాధను కలిగించింది. ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాదు.. అంటూ శివ రాజ్‌కుమార్ ట్వీట్ చేశారు.
‘కావేరి సమస్య ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో ఉంది. అప్పటి ఉంచి మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు నటులు ముందుకు రారు అంటున్నారు. మేము వస్తే.. మీ సమస్య పరిష్కారం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. మాకు స్టార్ డమ్ ఇచ్చింది మీరే కదా.. కావాలంటే ఆ స్టార్‌డమ్ మీరే తీసేయండి’ అని శివ రాజ్‌కుమార్ అన్నారు. ఇక సిద్ధార్థ్ ప్రెస్ మీట్‌ను అడ్డుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ అతని ప్రెస్ మీట్‌ను ఎవరు ఆపారో తెలియదు కానీ.. అలా చేయడం తప్పు. కర్ణాటక ప్రజలు అందరినీ స్వాగతిస్తారు. సమస్యలు అన్ని చోట్లా ఉంటాయి. సమస్యకు పరిష్కారం వెతకాలి.. అంతేకానీ ప్రెస్ మీట్‌లో కూర్చొని మాట్లాడుతున్న మనిషిని అలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని అన్నారు.