అమెరికాలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్రరాజ్యం క్యాపిటల్ భవనం ఎదుట ఉన్న విశాల ప్రాంగణంలో ఉత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపై తెచ్చే యత్నంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాల్లో ప్రపంచ వ్యాప్తంగా 17 వేల మంది కళాకారులు పాల్గొనంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అనేక దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొననున్నారు. ‘ప్రపంచంలో ‘విభేదాలు తీవ్రం కావడం, ప్రతికూల భావనలు, మానసిక ఆరోగ్య సవాళ్లు నెల్కొన్న ప్రస్తుత తరుణంలో ఈ సాంస్కృతిక వేడుకలను నిర్వహించడం సంతోషదాయకం’’ అని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. భిన్నత్వం ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తాన్నీ ఒకే కుటుంబంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు 60వేల మందికిపైగా రిజిస్టర్ చేసుకున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి కుషాల్ చోక్సీ తెలిపారు.