ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో బిఆర్ఎస్‌కు సొంత పార్టీ నేతలే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈసారి వారికి టికెట్ ఇవ్వవద్దని అధిష్టానానికి కాకుండా దేవుడికి చెప్పుకుంటున్నారు, మొక్కులు మొక్కుతున్నారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవునండి ఇవన్నీ తెలంగాణ చొప్పదండి నియోజకవర్గం లో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విషయంలో జరుగుతున్నాయి.
చొప్పదండి నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీరు 2018 ఎన్నికలలో గెలిచిన దగ్గర నుండి వివాదాస్పదంగానే ఉంది. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్న నేతలందరూ ఈసారి రవిశంకర్ కు టికెట్ రాదని అనుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ కేసీఆర్ చొప్పదండి అభ్యర్థిగా రవిశంకర్ పేరుని ప్రకటించారు. అవినీతి ఆరోపణలు ఉన్న రవిశంకర్ పేరును ప్రకటించడంతో కార్యకర్తలలో నేతలలో సిట్టింగ్ ఎమ్మెల్యే పై వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరింది.
బోయిన్ పల్లి, కొడిమ్యాల మండలాలలో నేతలకు, ఎమ్మెల్యేకు మధ్య వినోద్ కుమార్ సయోధ్య కుదర్చారని వార్తలు వస్తున్నా, వాటిలో వాస్తవం ఎంతో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి పథకాల అమలులో ఎమ్మెల్యే అనుచరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చొప్పదండి టికెట్ ఆశించి భంగపడిన బండపల్లి యాదగిరి అనుచరులు అభ్యర్థిని మార్చాలని నల్లగొండ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో 116 కొబ్బరికాయలు కొట్టారంటే తమ నాయకుడికి టికెట్ రాలేదనే బాధతో కొట్టారు అనుకోవచ్చు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు కూడా చొప్పదండి అభ్యర్థిని మార్చాలని నల్లగుట్ట నరసింహస్వామికి 108 కొబ్బరికాయలు కొట్టడం చర్చనీయాంసమైంది. ఈ పరిస్థితులలో చొప్పదండి అభ్యర్థిని కేసీఆర్ మారుస్తారా?లేదా?అనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తున్నారు.