తాను నటించిన మార్క్ ఆంటోని సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపిస్తూ విశాల్ కొన్ని రోజుల క్రితం ట్విటర్లో ఓ వీడియో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సెన్సార్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం విశాల్ ఆరోపణలపై స్పందించింది. విశాల్ నుంచి లంచం డిమాండ్ చేసింది సెన్సార్ సభ్యులు కాదని.. థర్డ్‌పార్టీ వారని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ- సినీప్రమాన్‌ను వేదిక చేసుకోవాలని దర్శక, నిర్మాతలకు బోర్డు విజ్ఞప్తి చేసింది. నిబంధనలు పాటిస్తూ నిర్ణీత సమయంలోనే సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సీబీఎఫ్సీ ప్రతి సంవత్సరం 12 వేల నుంచి 18 వేల చిత్రాలకు సర్టిఫికెట్ ఇస్తుందని.. ఇన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుందని.. కొందరు నిర్మాతలు తమ సినిమాలకు అత్యవసరంగా సర్టిఫికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటారని ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు పేర్కొంది.