భయంతో పనిచేస్తున్నామంటూ.. సీజేఐకి మీడియా సంస్థల లేఖ

-

భారత్​లో జర్నలిస్టుల హక్కులు కాలరాస్తున్నారని పలువురు పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు జర్నలిస్టులను విచారించేందుకు ప్రత్యేక విధివిధానాలను రూపొందించాలని కోరుతూ 15 మీడియా సంస్థలు ఇవాళ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశాయి. జర్నలిస్టుల నుంచి పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటివి స్వాధీనం చేసుకునేందుకు కూడా విధివిధానాలు రూపొందించాలని లేఖలో కోరాయి. జర్నలిస్టులపై ప్రతీకార దాడులు జరగకుండా..  వారు నిజాలు మాట్లాడగలిగినంత కాలం దేశంలో స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుందని అభిప్రాయపడ్డాయి.

ఇటీవల న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పనిచేసే ఉద్యోగుల ఇళ్లలో దిల్లీ పోలీసులు సోదాలు చేయడం.. పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థను అరెస్టు చేయడం వంటి అంశాలను మీడియా సంస్థలు తమ లేఖలో పేర్కొన్నాయి. దేశంలో చాలా మంది పాత్రికేయులు ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో పనిచేస్తున్నారని తెలిపాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదని.. వారిని కట్టడి చేసేందుకు సోదాల పేరిట ప్రతీకార దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించాయి. పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే సమాజంలో ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీజేఐకి రాసిన లేఖలో ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news