నేటి నుంచే సీఎం అల్పాహార పథకం ప్రారంభం

-

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ నేడు లాంఛనంగా ప్రారంభంకానుంది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టనున్నారు. మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవుల తర్వాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించనున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు డ్రాపౌట్లను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడానికి ఈ పథకం ఉపయోగపడనుంది. 27 వేల 147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అల్పాహారాన్ని అందించనుంది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జెడ్పీ పాఠశాలలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి…. ఇవాళ ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ పాల్గొని విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకోనున్నారు. పాఠశాల సమయానికి కంటే 45 నిమిషాల ముందు విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించనున్నారు. సోమవారం ఇడ్లీ సాంబార్‌ లేదా గోధుమ రవ్వ, మంగళవారం పూరీ ఆలూకుర్మా లేదా టామటా బాత్, బుధవారం ఉప్మా సాంబరు లేదా బియ్యంతో చేసిన రవ్వ కిచిడి, గురువారం చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ సాంబార్‌ లేదా పొంగల్ సాంబార్‌, శుక్రవారం ఉగ్గాని లేదా చిరుధాన్యాల ఇడ్లీ లేదా గోధుమ రవ్వ కిచిడి, శనివారం పొంగల్ సాంబార్‌ లేదా కూరగాయలతో చేసిన పులావ్‌ను విద్యార్థులకు అల్పాహారంగా అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news