టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. 20 రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఏపీకి చేరుకున్న టీడీపీ ప్రధాన కార్యద్శి నారా లోకేశ్ నేడు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ తన తల్లి నారా భువనేశ్వరి, సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి మీడియాతో మాట్లాడారు. అయితే.. మీడియా సమావేశంలో నారా బ్రాహ్మణి గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు లోకేశ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
టీడీపీలో నారా బ్రాహ్మణి పాత్ర ఏమిటి? అని ఓ మీడియా ప్రతినిధి… లోకేశ్‌ను ప్రశ్నించారు. దానికి లోకేశ్ స్పందిస్తూ… ఇదేం క్వశ్చన్ సామి అన్నారు. మా తల్లి మాజీ ముఖ్యమంత్రి కూతురు, మరో మాజీ ముఖ్యమంత్రి భార్య, కానీ ఆమె ఎప్పుడైనా బయటకు వచ్చారా? ప్రమాణ స్వీకారానికి తప్ప ఏ కార్యక్రమానికైనా నా తల్లి హాజరయ్యారా? కానీ ఈ రోజు తమ కుటుంబం మొత్తాన్ని రోడ్డుపైకి తీసుకు వచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ పిచ్చి జగన్ అని మండిపడ్డారు. తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మాత్రమే పోరాడుతామన్నారు. తద్వారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు చంద్రబాబు కోసం రోడ్డుపైకి వచ్చారు తప్ప పార్టీలో ఏదో పాత్ర కోసం కాదని అర్థం వచ్చేలా సదరు మీడియా ప్రతినిధికి గట్టి కౌంటర్ ఇచ్చారు.