పార్లమెంట్ లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందే వీటిని అమలు చేయాలని పిటిషన్ లో కోరారు. పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇటీవలే అది చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లుకు సెప్టెంబర్ నెలలో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. అయినప్పటికీ ఈ చట్టం ప్రస్తుతం అమలులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జనగణన, డీలిమిటేషన్ తరువాత ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ లోక్ సభకు తెలిపారు. ఇలా ఈ చట్టం అమలు ఆలస్యం అవుతుండటంపై కాంగ్రెస్ నేత డాక్టర్ జయ ఠాకూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్టం అమలుకు ఉన్న అడ్డంకులను చెల్లనివిగా ప్రకటించి.. తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.