ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది క్యాబినెట్. ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. ముఖ్యంగా పెన్షనర్లకు 4 శాతం డియర్ నెస్ రిలీఫ్. జులై 01, 2023 నుంచి ఇది అమలులోకి రానుంది. రైల్వే నాన్ గెజిటేడ్ ఉద్యోగులకు 18 రోజుల బోనస్ ప్రకటించింది. అదేవిధంగా రబీలో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు చాలా మేలు జరుగుతుందని చర్చించుకోవడం గమనార్హం.
మరోవైపు ఇటీవలే తెలంగాణలోని మహబూబ్నగర్లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు. అందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మరోవైపు.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా మోదీ హామీ ఇవ్వగా.. దీనికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 889 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు పెట్టిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.