కాళేశ్వరం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని తాము ముందునుంచి చెప్తూనే ఉన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు . నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిందని ఆయన అన్నారు. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బ్యారేజ్ వద్ద పిల్లర్ కుంగిపోవడానికి కారణం కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు.
కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబం అని విమర్శించారు. నాణ్యతా లోపంతోనే మేడిగడ్డ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని రేవంత్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. మేడిగడ్డ ఘటనపై కేంద్ర హోంమంత్రి, గవర్నర్, ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు. మేడిగడ్డకు వెళ్లేందుకు ఈసీకి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు కూడా తమతో కలిసి మేడిగడ్డకు రావాలని డిమాండ్ చేశారు.