మరో సంచలనానికి సిద్ధమవుతున్న జగన్.. ?

-

ఏపీ సీఎం జగన్ ఇప్పటికే పలు సంచలనాలు సృష్టిస్తున్నారు. పథకాల అమలు, ప్రతిపక్షంపై దాడి.. రివర్స్ టెండరింగ్.. ఇంగ్లీష్ మీడియం ఇలా.. రోజుకో సంచలనం సాగుతోంది. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపుతున్నారు. రాష్ట్రంలో అవినీతిని కట్టడి చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఇందు కోసం ఏసీబీని ఆయుధంగా మలచుకున్నారు.

రాష్ట్రంలో అధికారుల అవినీతి భారీగా ఉందని.. దాన్ని కట్టడి చేయకపోతే ప్రజల ఇబ్బందులు తగ్గవన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. అందుకే స్పందన కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల మేరకు అధికారులపై నిఘా ఉంచాలని నిర్ణయించారు. అయితే పెద్ద ఎత్తున జనం ఫిర్యాదులు చేస్తున్నందువల్ల ప్రస్తుతం ఉన్న ఏసీబీ వాటన్నింటినీ చెక్ చేసే అవకాశం లేదు.

రాష్ట్రంలో ప్రతి వారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది జనం తమ సమస్యలు వెల్లడిస్తున్నారు. వారు చేసే ఫిర్యాదుల్లో ఎక్కువగా అధికారుల అవినీతి గురించే ప్రస్తావిస్తున్నారట. స్పందన కార్యక్రమం ద్వారా వెల్లడవుతున్న సమాచారం చూసి ముఖ్యమంత్రి షాకయ్యారట. అందుకే.. ముందు ఏసీబీని బలోపేతం చేసిన తర్వాత అవినీతి అధికారుల పని పట్టాలని జగన్ భావిస్తున్నారట.

స్పందన కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్ ఈ విషయాన్ని ఖరాఖండీగా చెప్పేశారట. అధికారుల, ఉద్యోగుల అవినీతిని ఏమాత్రం సహించేది లేదన్న జగన్.. త్వరలోనే వారి ఆట కట్టించే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారట. రాష్ట్రంలో ఏసీబీ చాలా చురుకుగా పనిచేస్తోందని జగన్ కితాబిస్తున్నారు.

వాస్తవానికి పై స్థాయిలో అంటే సీఎం స్థాయిలో పాలన ఎంత బాగున్నా.. అధికారులు దాన్ని సరిగ్గా అమలు చేయకపోయినా.. లంచగొండి తనంతో చెడగొట్టినా చివరకు ఆ భారం ప్రజలపైనే పడుతుంది. చివరకు ప్రభుత్వ పాలన బాగాలేదన్న అభిప్రాయం వస్తుంది. అందుకే అవినీతిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన జగన్ ఇందుకు తగిన ప్లాన్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఉద్యోగులపై ఇలా విరుచుకుపడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మరి.

Read more RELATED
Recommended to you

Latest news