రాహుల్ గాంధీకి సత్తా ఉంటే హైదరాబాద్‌లో పోటీ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఛాలెంజ్ విసిరారు. అప్పుడు ఆయనకు ఎంఐఎం పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉందని.. మిగిలిన పవర్ అంతా తమ పార్టీ చేతిలోనే ఉందని తెలిపారు. కాంగ్రెస్ పతనానికి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీలో చేరి సైకిల్ పార్టీని రాష్ట్రంలో భూ స్థాపితం చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్‌ను ముంచడానికి పని చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఆర్‌ఎస్‌ఎస్‌కి మాతృ సంస్థ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు వేర్వేరు పార్టీలు కాదని రెండు ఓకే జాతికి చెందిన పార్టీలని ఆయన అభివర్ణించారు. తమ పార్టీకి బీజేపీ డబ్బులు ఇస్తోందని రాహుల్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు మద్దతివ్వాలని అసదుద్దీన్ ప్రజలను కోరారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డిపై దాడిని తాము ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ మద్దతు కేసీఆర్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు కేసీఆర్‌కు అండగా నిలవాలని సూచించారు.