ఏపీ ప్రజలకు అలర్ట్.. జపాన్ కు చెందిన డైకిన్ సంస్థ ఏపీలో ఏసీలను తయారు చేయనుంది. నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో 75 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1000కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంట్ లో ఈనెల 23న ఉత్పత్తిని ప్రారంభించనుంది. తొలి దశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా ఏటా 10 లక్షల ఏసీలను తయారు చేయవచ్చు. గతేడాది ఏప్రిల్ లో నిర్మాణ పనులు ప్రారంభించగా… 18 నెలల్లోనే యూనిట్ ను సిద్ధం చేసింది. ఈ యూనిట్ ద్వారా 3 వేల మందికి ఉపాధి దక్కింది.
ఇక అటు త్వరలోనే కర్నూలులో లా యూనివర్సీటీ ప్రారంభం కానుంది. కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలియజేశారు. ఆదివారం కర్నూలు జిల్లా, కల్లూరు మండలం లక్ష్మీపురంలోని న్యాయ విశ్వవిద్యాలయ ఏర్పాటు స్థలాన్ని మంత్రి బుగ్గన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగన్నాథ్ గట్టుపై రూ. 600 కోట్లతో 250 ఎకరాలలో నిర్మించబోయే లా యూనివర్సిటీకి డిసెంబర్ లో భూమి పూజ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నేషనల్ యూనివర్సిటీ (ఎన్ ఎల్ యూ) ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు న్యాయ విద్యను అభ్యసించేందుకు వీలుందంటున్నారు.