రాష్ట్రంలో ఎన్నికల వేళ ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే మాజీ ఎంపీ, మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ.. వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా తాజాగా 100కోట్ల నగదు బదిలీ జరిగినట్లు తెలిపింది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు ఈ సొమ్ము తరలింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. వివేక్, అతడి భార్య నిర్వాహకులుగా ఉన్న విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ లావాదేవీలను పరిశీలించగా.. విజిలెన్స్ సర్వీసెస్ సంస్థ తన కార్యకలాపాల ద్వారా సుమారు 20లక్షల ఆదాయం పొందినట్లుగా బ్యాలన్స్ షీట్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
మొత్తంగా సంస్థలో 200కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు ఈడీ తెలిపింది. విశాఖ ఇండస్ట్రీస్‌తో విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు వాస్తవ వ్యాపార లావాదేవీలు లేవని.. విజిలెన్స్ సెక్యూరిటీ సైతం వివేక్ నియంత్రణలోనే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు యశ్వంత్ రియల్టర్స్ మాతృ సంస్థగా ఉందని.. ఈ రియల్టర్స్‌లో అధికశాతం వాటాలు ఓ విదేశీయుడి పేరిట ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విదేశీ సంస్థలో విజిలెన్స్ సెక్యూరిటీస్‌ను విలీనం చేయడంలో ఫెమా ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు.