కోలీవుడ్ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చెన్నైలోని MIOT ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆయన డయాబెటిస్ తో బాధపడుతున్నారు. లివర్ సమస్య కూడా ఉన్నది. జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన మూడు వేళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు వైద్యులు చెబుతున్నారు.
తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి చెన్నైలోని MIOT హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. విజయ్ కాంత్ ఆరోగ్యం కాస్త కుదుటపడినా, గత 24 గంటలుగా విషమంగా మారినట్లు వెల్లడించింది. వైద్య చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందని చెప్పిన డాక్టర్లు, పరిస్థితి మాత్రం నిలకడగా లేదని తెలిపారు. అతడు కోలుకోవడానికి పల్మనరీ చికిత్సను వైద్య నిపుణులు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు, ఆయన కోలుకోవడానికి మరో 14 రోజుల పాటు నిరంతర చికిత్స అవసరం అని వెల్లడించారు. విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 18న ఆసుపత్రిలో చేరారు.