గతేడాదిలో భారత్‌లో రోజుకు సగటున 78 హత్యలు జరిగాయని.. మొత్తం 28,522 హత్య కేసులు నమోదయ్యాయని జాతీయ నేరగణాంకాల సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వివాదాలే హత్యలకు ప్రధాన కారణాలని.. ఆ తర్వాత వ్యక్తిగత ప్రతీకారం, పగ, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. 2022లో సాధారణ నేరాలు తగ్గినా.. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, వయోవృద్ధులపై మాత్రం విపరీతంగా పెరిగాయని వెల్లడించింది.
2021తో పోలిస్తే 2022లో సాధారణ నేరాల సంఖ్య 4.5% మేర తగ్గిందని.. అదే సమయంలో మహిళలపై 4%, చిన్నారులపై 8.7% పెరిగాయని నివేదిక పేర్కొంది. సైబర్‌నేరాలు ఏడాది కాలంలో 52,974 నుంచి 65,893 (24.4%)కు పెరగగా.. ఈ విభాగంలో క్రైమ్ రేట్ 3.9 నుంచి 4.8కి పెరిగిందని తెలిపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నమోదైన కేసులు 5,164 నుంచి 5,610 (8.6%)కి పెరిగాయని.. ఇందులో 78.5% కేసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన కారణంగా, 17.9% కేసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
క్రమసంఖ్య | నేరం | పెరిగిన శాతం |
1 | కిడ్నాప్‌లు | 5.8% |
2 | వృద్ధులపై వేధింపులు | 9.3% |
3 | ఎస్సీలపై వేధింపులు | 13.1% |
4 | ఎస్టీలపై నేరాలకు సంబంధించి | 14.3% |
5 | ఆర్థిక నేరాలు | 11.1% |
6 | అవినీతి కేసులు | 10.5% |
7 | సైబర్‌నేరాలు | 24.4% |
8 | మనుషుల అక్రమ రవాణా | 2.8% |
9 | మిస్సింగ్ కేసులు | 13.5% |
10 | ఆచూకీ తెలియని చిన్నారుల కేసులు | 7.5% |
11 | ఆస్తి సంబంధ నేరాలూ | 10.1% |