రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ చట్టాల నిపుణులను సభ్యులుగా నియమించాలని సూచించారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. ధరణి- భూ సమస్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ధరణి నిర్వహణ, పారదర్శకతపై అనేక ప్రశ్నలు సంధించారు. పోర్టల్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన నిర్ణయాలపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు చెప్పారు.
పోర్టల్‌కు సంబంధించిన వివరాలపై నవీన్ మిత్తల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా.. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో సమాచారం అందించాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల సేవలకు భూ యజమానులు చెల్లిస్తున్న సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్తోందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సేవలకు రైతులు చెల్లించే మొత్తం ప్రభుత్వ ఖజానాకే చేరుతోందా? లేక పోర్టల్ నిర్వహణదారుల చేతుల్లోకి వెళ్తోందా? అని అడిగినట్లు సమాచారం. చెల్లింపులు రద్దు చేసుకుంటే ఆ సొమ్ములు దరఖాస్తుదారులకు వెనక్కి ఇవ్వడం లేదని తెలిసిందని… అవి ఎవరి వద్ద ఉంటున్నాయని… నవీన్ మిత్తల్‌ను ప్రశ్నించారు. ఆ డబ్బుల చెల్లింపు జరుగుతోందని ఆయన వివరణ ఇచ్చారు.