చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు 111 మంది మృతి చెందారు. మరో 200 మందికిపైగానే గాయపడినట్టు సమాచారం. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
చైనాలోని వాయువ్య గన్స్, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు డ్రాగన్ మీడియా పేర్కొంది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైందని.. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలకూలడం.. ప్రజలు భయాందోళనతో రోడ్లవెంట పరుగులు తీయడం వంటి అంశాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో వేగం పెంచాయి. వీలైనంత వరకు మరణాలు తగ్గించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ విపత్తుపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.