ఏపీలో బీజేపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి…? దీని వెనుక వినపడుతున్న పేరు చంద్రబాబు… రాజకీయంగా నష్టపోయిన ఆయన కేంద్రానికి దగ్గర కావాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు ఎక్కువగానే చేస్తున్నారు. ముందు నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపిన ఆయన ( ఈ విషయం ఆయన ఒప్పుకోకపోయిన సగటు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారందరికి తెలిసిందే ) వారి ద్వారా ముందు అమిత్ షా కు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు ఎక్కువగా ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమ ఆలోచనలతో నానా కష్టాలు పడుతున్నారు.
అక్కడ వారి కష్టాలు వారు పడుతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతీ సారి ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి సహకారంతో చంద్రబాబు పలు నివేదికలు కేంద్రానికి, ప్రభుత్వంపై వ్యతిరేకంగా పంపిస్తున్నారన్న టాక్ ఉండనే ఉంది. ఇసుక విషయంలో లేని వాస్తవాలను ఉన్నట్టుగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
సుజనా చౌదరి రాష్ట్రంలో పర్యటించిన సమయంలో ఈ నివేదికలు ఇవ్వడానికి బీజేపీ నేతలను బాబు వాడుకునే ప్రయత్నం చేశారు. ఇక కేంద్రంలో బీజేపీతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండటంతో బీజేపీ నేతలు విమర్శించినా వైసీపీ పెద్దగా స్పందించడం లేదు. దీంతో దాని మీద కూడా చంద్రబాబు ఒక ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని అలుసుగా తీసుకుని పదే పదే వారితో విమర్శలు చేయిస్తున్నారు చంద్రబాబు. కన్నా లక్ష్మీ నారాయణ అదే పని మీద ఉండి వైసీపీని తిట్టేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.
పల్నాడులో బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరగకపోయినా జరిగాయని చిత్రీకరించారు. ఈ విధంగా కేంద్రానికి దగ్గర కావాలని బీజేపీ నేతలను బాబు అన్ని విధాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టే కనపడుతోంది. అటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా చంద్రబాబుకి సహకరిస్తూ, పవన్ కు వంత పాడుతూ ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడుతున్నారు. అయితే ఏ పార్టీలో అయినా అందరూ ఒకేలా ఉండరు కదా… ఏపీ బీజేపీలో కూడా కొందరు ఈ డ్రామాలు గమనించి జగన్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.