దక్షిణ మధ్య రైల్వే ఏడు ఇంధన పరిరక్షణ అవార్డులు పొందింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పురస్కారాలను దక్కించుకుంది. తెలంగాణలో ఐదు, ఏపీలో రెండు అవార్డులను సాధించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బుధవారం రోజున ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులను సంబంధిత డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్లు, డివిజనల్ ఎలక్ట్రికల్ అధికారులు అందుకున్నారు.
రైల్వేస్టేషన్ భవనాల విభాగంలో నల్గొండ రైల్వే స్టేషన్‌కు గోల్డ్ అవార్డు, కాచిగూడ రైల్వేస్టేషన్‌కు సిల్వర్, ప్రభుత్వ భవనాల విభాగంలో లేఖ భవన్‌కు(దక్షిణ మధ్య రైల్వే అకౌంట్స్ ఆఫీస్ బిల్డింగ్) గోల్డ్, హైదరాబాద్‌లోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పి.ఆర్.ఎస్.) భవనానికి సిల్వర్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ విభాగంలో లాలాగూడలోని క్యారేజ్ వర్క్‌షాప్‌నకు సిల్వర్ అవార్డు లభించాయి.
ఏపీలో భవనాల విభాగంలో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ భవనానికి గోల్డ్ అవార్డు, గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ భవనానికి సిల్వర్ పురస్కారం దక్కింది.