ప్రభుత్వం కట్టాల్సింది రూ.3.05 లక్షల కోట్లు మాత్రమే : కేటీఆర్

-

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల సమర్పించిన శ్వేదపత్రం తప్పుల తడక అని, అందులోవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆరున్నర దశాబ్దాల్లో అన్ని ప్రభుత్వాలు కలిసి తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమానికి చేసిన ఖర్చు రూ. 4.98 లక్షల కోట్లు మాత్రమేనని, కానీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చు మాత్రం రూ. 13.72 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. శ్వేదపత్రంలో రూ. 6.71 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపించిందని, కానీ వాస్తవం రూ. 6.22 లక్షల కోట్లు మాత్రమేనని, ఇందులో ప్రభుత్వం కట్టాల్సింది రూ. 3.05 లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వేదపత్రంను కేటీఆర్ విడుదల చేశారు.


పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ.1.76 లక్షల కోట్లను ఖర్చు చేసిందని, ఇందులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు  రూ. 26,738 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. విద్యుత్ రంగం మీద ఖర్చు పెట్టిన ఖర్చు రూ.1.37 లక్షల కోట్లతో దాదాపు రూ. 6.87 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్లు తెలిపారు. ప్రభుత్వం పదేండ్ల కాలంలో పేదల సంక్షేమం కోసమే రూ.2.86 లక్షల కోట్లను ఖర్చు చేసిందని, ఇందులో రైతుబంధుకు రూ.73 వేల కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.61 వేల కోట్లు, రుణమాఫీకి 30 వేల కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ కు రూ.36.899 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ఇక ఎస్సీ సంక్షేమానికి రూ. 92,640 కోట్లు, ఎస్టీలకు రూ.43,936 కోట్లు, బీసీలకు బీసీలకు 44,393 కోట్ల చొప్పున ఉన్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో పదేండ్ల కాలంలో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు రూ. 3.41 లక్షల కోట్లు ఉన్నట్లు వివరించారు. పట్టణ ప్రగతి కోసం రూ. 1.21 లక్షల కోట్లు ఖర్చు చేస్తే పల్లె ప్రగతి కోసం రూ.70 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. పదేళ్ల కాలంలో చేసిన ఖర్చుతో దాదాపు రూ.50 లక్షల కోట్ల కంటే ఎక్కువ సంపదను బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news