దేశ రాజధాని దిల్లీ చలికి గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. పొగమంచుతో హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు దీనివల్ల వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లోనూ బయటకు వెళ్దామంటే పొగమంచు వల్ల రహదారులు కనిపించక ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి బయటకు వెళ్లినా ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని భయపడుతున్నారు.
రవాణా వ్యవస్థపై పొగమంచు పెను ప్రభావం చూపిస్తోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. దిల్లీలో గాలి నాణ్యత కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు తగ్గింది. పొగమంచు కారణంగా దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. దిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారిమళ్లిస్తున్నారు.