రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సచివాలయంలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేశారు. ప్రజా పాలన పేరుతో ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రం లోగోను విడుదల చేశారు. రేపటినుండి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీల లబ్ధి పొందేందుకు ఈ అప్లికేషన్ ఫామ్ లో వివరాలు నింపి సమర్పించాల్సి ఉంటుంది.
ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారెంటీలో అమలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. ఇక లోగోను ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తామన్నారు. పదేళ్లు ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందనేది ప్రజావాణి చూస్తే అర్థమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండా ఉండేలా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.