ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత, మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ దుర్మరణం చెందాడు. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతంలో మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో అతను మరణించాడు. ఈ పేలుడులో ఆరుగురు మృతి చెందినట్లు లెబనాన్ అధికార వార్తా సంస్థ తెలిపింది. అందులో అరౌరీ కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది.
హెజ్‌బొల్లాకు గట్టి పట్టున్న ప్రాంతమైన దక్షిణ బీరుట్ శివారులో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అరౌరీ హత్య నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై లెబనాన్ ఆపద్ధర్మ ప్రధాని నజీబ్ మికాతీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ తమను యుద్ధంలోకి లాగాలని చూస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఇప్పటికే గాజాపై భీకర పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్పై హమాస్ ఎదురుదాడి తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపిస్తూ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇంకోవైపు ఉత్తర గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకున్న ఇజ్రాయెల్-దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై దాడులు ఉద్ధృతం చేసింది.