అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ఆరు నెలల ముందే తెలుసని అన్నారు. తాను ఓడిపోతున్నానని డిసెంబరు 1వ తేదీ నాడే రేవంత్ రెడ్డికి ఫోన్‌లో చెప్పానని తెలిపారు. ఇక సంగారెడ్డిలో పోటీ చేయనని సంగారెడ్డిని వదిలేసి రాష్ట్రమంతా తిరిగి పార్టీ కోసం పని చేస్తానని చెప్పానని వెల్లడించారు. తాను అందుబాటులో ఉండనని బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మినప్పుడు వారిని ఎందుకు ఓట్లడగాలని వ్యాఖ్యానించారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని లేదని పార్టీ ఏం నిర్ణయిస్తే అది జరుగుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పరోక్షంగా చెప్పిన ఆయన.. బుధవారం రోజున ఇందిరాభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో జగ్గారెడ్డి అరగంటసేపు ఉన్నారు. ఆ తరవాత బయటికి వచ్చి గాంధీభవన్‌లో కూర్చున్నారు. సమావేశం ముగిసేముందు జగ్గారెడ్డి మళ్లీ లోపలికి వెళ్లారు.