జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించిన వారికి ఒక్క కాపు కులస్తుడు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని రఘురామకృష్ణ రాజు తెలిపారు. సత్తెనపల్లి, అనకాపల్లి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలలో కాపులదే ఆధిపత్యం అని, మంత్రులు అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి పేర్ని నాని గారితో జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టించారని, గతంలో వీరికి ఓట్లు వేసి గెలిపించిన కాపులు, పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టినందుకు… ఇప్పుడు వారికి ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని ఫైర్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టించిన జగన్ మోహన్ రెడ్డి గారు ఆయా నియోజకవర్గాలలో సర్వే చేయించారని, ఆ సర్వేలో స్థానిక శాసనసభ్యులకు ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారి కక్షకు పాపం అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు బలి కాబోతున్నట్లు పత్రికల్లో వార్తా కథనాలు చూశాం అని అన్నారు. ప్రజలకు అందుతున్న సమాచారం మేరకు గుడివాడ అమర్నాథ్ గారికి సీటు లేదని తెలుస్తోందని, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు చేయడమే ఆయన చేసిన నేరం అని అన్నారు. ఏ కులం వారిని ఆ కులం నాయకుల చేత తిట్టించడంలో భాగంగా కాపు నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారిని, క్షత్రియ నాయకుల చేత తనను జగన్ మోహన్ రెడ్డి గారు తిట్టించారని తెలిపారు.