కేంద్ర ఎన్నికల కమిషన్ మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ విజయవాడ కు వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఏపీ సీఈఓ ఎంకే మీనా లేఖ రాశారు. గత నెల 23 న టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్ పై తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ సీఈఓ టీడీపీకి ప్రత్యుత్తరం రాశారు.
ఈ క్రమంలోనే ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం నాడు చంద్రబాబు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలవనున్నారు. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబర్ 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని మీనా వివరించారు. డిసెంబర్ 9 వ తేదీ తరువాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 వ తేదీలోగా పరిష్కారిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించామని వివరించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించాం. ఇందులో సుమారు 5 లక్షల 64 వేల 819 పేర్లను అనర్హులుగా గుర్తించినట్లు మీనా లేఖలో వివరించారు.