లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని, గట్టిగా పోరాడితే ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ భవన్ లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించిందన్నారు. హామీల అమలుపై కాంగ్రెస్ ఇప్పటికే మాట దాటవేస్తుందన్నారు. అప్పులు, శ్వేత పత్రాలు అంటూ అభయ హస్తం హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు దళితబంధు పథకం పైనా ప్రభుత్వం స్పందిం చడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు 420 హామీలని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.